Sunday, August 16, 2015

Dying to be what!?దేవకట్ట గారు... మీ 'డయ్యింగ్ టు బి మీ' చూశాక మీ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం మీద అనుమానం వేస్తోంది.
చదవండి  ఎందుకో.

మీరు చూపించినదాన్ని బట్టి అర్థమయ్యేవి ఇవే...
1. ఆడవారు ఇంట్లో ఉండటం వెనుక మగాడి పాత్ర తప్ప ఇంకేమీ లేదని.
2. పెళ్ళయిన తరువాత తీసుకోవాల్సిన బాధ్యతల కన్నా ఉద్యోగం చేస్తే వచ్చే స్వేఛ్ఛ ప్రధానం అని.
3. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వంటకి, సిరియళ్ళు చూట్టానికి మాత్రమే పనికి వస్తారు అని.
4. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వారి అలంకరణ మీధ ధ్యాస పెట్టరు అని.
5. ఆడవారు చేసే ఇంటి పని విలువలేనిదని.

మీ కథలోని భర్త పాత్ర చాలా విచిత్రంగా ఉంది.  భార్య ఉద్యోగం వచ్చిందని చెబితే "వావ్! కంగ్రాట్స్ ! " అంటాడు, మరోవైపు వద్దంటాడు.
బహుశా మీ ఆత్మ వాడిలోకెళ్లినట్టుంది - కన్ఫ్యూషన్లో ఏదో మాట్లాడుతున్నాడు.

ఇహ భార్య అయితే భర్త కన్నా మతి భ్రమించిందేమో అనిపిస్తోంది.

పెళ్లి కాకముందు ఉద్యోగం కోసం అప్లై చేసిందనుకుందాం.  ఉద్యోగం ఇంత ముఖ్యమని అనుకున్నప్పుడు పెళ్లి కాకముందు ఈ విషయమై కాబోయే భర్తని ఒప్పించి ఉండాలి.
 ఒప్పుకోకపోతే ('డయ్యింగ్ టు బి మీ'  కాబట్టి )  పెళ్లే చేసుకుని ఉండకూడదు.
 ఒప్పుకుని ఉంటే ఈ 'డయ్యింగ్ టు బి మీ'  భాగోతం ఉండే ఆస్కారమే లేదు.

ఒకవేళ పళ్లయిన తరువాత ఉద్యోగం కోసం అప్లై చేసిందనుకుందాం. అప్పుడు భర్త అనుమతి అవసరం లేదనుకుందో లేదో తెలీదుకాని,
నిర్ణయం ఏదయినా అది కొత్తగా వచ్చిన బాధ్యతలు (అనగా అత్తామామలు, పిల్లలు వగైరా) అన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన నిర్ణయం.
ఒకవేళ పిల్లల్ని అత్తమామల మీద వదిలేద్దామనుకుందో ఏమో... బాధ్యతలకి నో, ఉద్యోగానికి  యెస్ చెప్పేసింది.

మీరు ఇంట్లో ఉండే ఆడవారందరు పరమ నరకప్రాయమైనా జీవితం వెళ్ళబుచ్చుతున్నట్టు చూపించారు.
మీరు చూపించిన చిత్రాలు ఎంత హాస్యాస్పదమైనవన్టే ...

"ఇంట్లో ఉన్న ఆడది తన అలంకరణ మీద ధ్యాస పెట్టదని, పని చేసి సీరియళ్ళు చూసుకుంటూ టైమ్ పాస్ చేస్తుందని."
వారిని అలాగే ఉండమని ఎవరైనా రాసి శాసించారా!?

లేక ఈ పాత్రలోకి కూడా మీ ఆత్మ ప్రవేశించిందా?

వ్యక్తిగత  స్వేఛ్ఛ  అనేది కేవలం ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. ఒక్కోసారి బాధ్యతలు స్వేఛ్ఛపై ప్రభావం చూపుతాయి. బాధ్యత-స్వేఛ్ఛల మధ్య సమతుల్యం ఉండేట్టుగా జీవితాన్ని మార్చుకోడానికి ఆ కుటుంబ బంధాలే ఎంతో కీలకమైన బలం.

వ్యక్తిగత  స్వేఛ్ఛ అనగా - ఆలోచన స్వేఛ్ఛ, వాక్  స్వేఛ్ఛ.

ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వేఛ్ఛ అనేది కూడా ముఖ్యం, కానీ పెళ్ళయిన తరువాత ఈ నిర్ణయం  కుటుంబ పరిస్థితులను బాధ్యతలను పరిగణించి తీసుకోవాల్సిన అవసరం భార్యాభర్తలిద్దరిపై ఉంది.

ఇద్దరు ఉద్యోగం చేయాలి, ఒక్కరే చేయాలి లేకా ఆడదే చేయాలా, మగవాడే చేయాలా లేక ఇద్దరు మానేయ్యాలా అనేది ముమ్మాటికి వారి వారి పరిస్థితులను బట్టి  కుటుంబ శ్రేయస్సు ప్రధానంగా తీసుకోవాల్సిన
నిర్ణయాలు. కుటుంబం బాగోకపోతే సమాజం ఎలా బాగుంటుంది?

లేక సమాజం బాగుంటే మనకి పనేముందంటారా?

లేక ప్రతి ఆడది మగాడు స్వేచ్ఛ పేరుతో బాధ్యతలు  వదిలేసి, పిల్లలను అమ్మా నాన్నలకు వదిలేసి, ఆ తరువాత వారిని ఒల్డెజ్ హోమ్ కి వదిలేసి
ఇదరు ఇంకా స్వేచ్ఛగా జస్ట్ రెండు గంటలు మాత్రమే తమతో తాము గడిపి, పిల్లలకు కూడా అదే నేర్పించమని చెప్తున్నారా?

దయచేసి ఈ సారి ప్రయత్నించినప్పుడు మీ ఉద్దేశ్యం అనుమానాస్పదంగా ఉన్నా కనిపించెట్టు చిత్రాలు చూపించకండి.

ఇక్కడ అందరం కొద్దో గొప్పో చిత్రాల భాగోతాలు తెలిసినవాళ్ళమే.
Monday, July 6, 2015


బాహుబలి - కథ 'బలి'


మూడు వందల కోట్లతో నిర్మించిన ఈ తెలుగు చలనచిత్రం ఇంకొన్ని రోజులలో విడుదల కావస్తుంది. మూడు సంవత్సరాల సుదీర్ఘ నిర్మాణ సమయం తీసుకున్న ఈ ప్రయత్నం మొదలవకముందునుండి దాని ప్రచార దుందుభి మ్రోగుతూనే వుంది. ఈ ప్రచార గందరగోళంలో ముఖ్యమైన ఒకే ఒక విషయమైన ఈ సినేమా కథ మాత్రం మూలన కూర్చుండిపోయింది.

ఇంతటి గొప్ప ప్రచారంలో కథ ప్రస్తావన లేకపోవడం కేవలం కాకతాళీయమా లేక నిజంగానే కథ అనేది ప్రస్తావించదగ్గ గొప్పదిగా లేకపోవడమా!

మనకు తెలియజెప్పినంతవరకు ఈ కథ ఒక రాజకుమారుడిది.
దాయాదుల దూరాక్రమణవల్ల, దుష్కర్మలవల్ల కోల్పోయిన తన తండ్రి యొక్క రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడమే కాకుండా, బందీ అయి ఉన్న తన తల్లిని విడిపించటం ఈ కథ సారాంశం.

ఈ మాత్రం దానికి మూడు వందల కోట్లు, మూడు సంవత్సరాలు ఎందుకు పట్టిందని మీరు ప్రశ్నించవచ్చు. Hollywood స్పెషలెఫ్ఫెక్ట్స్ కోసం పెట్టిన ఖర్చే ఇంత డబ్బు, సమయం. ఇంతటి గ్రాఫిక్వర్క్స్ లేకుండా తీయలేనంత కథ ఏమి కాదు ఇది. సెటింగ్స్, యుధ్ధాలే ఈ శ్రమలో సింహభాగం అనేది వాస్తవం. ఇంత ఖర్చుకు, శ్రమకు తగ్గ కథే అని మీకు అనిపించకపోవడం మీలో ఉన్న ఎన్నో సమాధానం లేని ప్రశ్నల ఫలితం.

ఒకసారి ఈ గ్రాఫిక్స్ గోల పక్కన పెట్టి ఒక కల్పిత పాత్ర మీద అల్లిన ఈ కథ గొప్పదనం, మిగిలిన ఉత్తమమైన కథలముందు దీని స్థాయి ఎంతో కూడా విశ్లేషించి చూద్దాము.

అసలు యుధ్ధాలు ఎందుకు జరుగుతాయి. 

ఇద్దరు దాయాదులైన రాజుల మధ్య జరిగే యుధ్ధాల విషయంలో ధర్మాధర్మాలు ఉన్నాయా అనేది మొదటి ప్రశ్న. యే గొప్ప యుధ్ధమైనా ధర్మాన్ని నిలబెట్టడానికి అధర్మాన్ని జయించటానికి ధర్మాత్ముడైన రాజు ఆధర్ముడైన తన శత్రువుపై చేసినది అయి ఉంటుంది. యుధ్ధం చేయకపోతే, అధర్మం గెలిచి ప్రజలు అధర్మాన్ని పాటించి లోకాన్ని తల్లక్రిందులుగా చేస్తారు. 

మన పురాణాల కాలం నుండి ఎన్నో యదార్థ గాథలు కథలు కథలుగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. 


1. రామాయణం

అది శ్రీరామచంద్రుడు తన భార్య అయిన సీతమ్మవారిని అపహరించిన రావణుడిని సంహరించి తిరిగి రాజ్యానికి తీసుకొచ్చిన కథ. 
శ్రీరాముని అవతరణ, సీతమ్మవారితో వివాహం, ఆ పై అపహరణ అన్నీ రావణుడి అంతానికి దోహదపడినవే.

రావణుడి రూపంలో యావత్ మానవ జాతికి వాటిల్లిన పెను ముప్పును నివారించడానికి నారాయణుడు శ్రీరాముడిగా అవతరించడంతో ఈ కథ మొదలవుతుంది. మానవుడు రాక్షసుడిని ఎదుర్కొనలేడు. దైవమే మానవ రూపాన్ని అవతరణ చేసుకొని రాక్షసుడిని ఎదుర్కొని సంహరించి తద్వారా తిరిగి ధర్మ సంస్థాపన చేయడం ఒక గొప్ప విషయం. ఒక ఉత్తమమైన కథకు లోకకళ్యాణమే గమ్యం.

శ్రీ రామునికి సహాయం చేసిన ఎందరో గొప్ప యోధులు వారి కోసం పని చేసిన ఎందరో బాహుబలులు ఈ కథలోని పాత్రలు.


2. మహాభారతం

'వింటే భారతమే వినాలి' అని ఎందుకన్నారో దీని గురించి తెలుసుకుంటేకాని అర్థం కాదు. శ్రీ కృష్ణావతారం కంసుడి వధకు మాత్రమే కాక, చెడుత్రోవ పట్టి అధర్మంవైపు నిలిచిన ఎందరో అతిరధ మహారధులు, ఇంకెందరో బాహుబలులు నాశనమవ్వడానికి కారణమయ్యింది.

ధర్మ సంస్థాపనార్థం దైవం తిరిగి అవతరిస్తాడు అనే సత్యాన్ని చెప్పే యదార్థ గాథ.పైన చెప్పిన రెంటిలోనూ లోక కళ్యాణం, సనాతన ధర్మసంస్థాపన అనేవి కథానాయకులకు ముఖ్య మైన అవసరాలు
వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యాలు కథావస్తువులు గావచ్చుకాని, అవి రాజులకు అన్వయించినప్పుడు అధమముగా గోచరించక మానవు. గొప్పగా లెక్కింపబడవు. అటువంటి అవసరాలు, ప్రాధాన్యాలు పూర్తిగా ఒక ప్రతికథానాయకుని పాత్రకు ఉండవలసిన లక్షణాలు. లోకనాయకునికి ఎప్పుడు సనాతన ధర్మం పై నిలచిన విలువలు, మానవ శ్రేయస్సే మొదటి ప్రాధాన్యత. 

ఈ లక్షణాలే గొప్ప కథలను, మామూలు కుటుంబ కథలను వేరు చేస్తాయి. ఒక మామూలు కథను కూడా గొప్పదిగా మామూలు పాత్రలను గొప్పవిగా చేసే లక్షణాలు కూడా ఇవే.

3. మన చక్రవర్తులు

ఒక్క పురాణాలే కాకుండా మన చరిత్ర నిండా ఈ ధర్మసంస్తాపనర్థం త్యాగాలు చేసి మ్లేచ్ఛులనుండి మనలను కాపాడి మన మనుగడను నిలబెట్టిన గొప్ప 
చక్రవర్తులే.

మొన్న మొన్నటి చరిత్రలోకెళితే చంద్రగుప్త మౌర్యుని వారసుడైన అశోకుడి శౌర్యం ఒక మాహా గ్రంధమే. ప్రపంచ చరిత్రలో యుధ్ధం గెలిచిన తరువాత రాజ్య కాంక్షను త్యజించిన ఏకైక చక్రవర్తి. రక్తపు ఏటిలో లభించిన విజయం పరాజయమే అని భావించి ధర్మ శాసనాలను స్థాపించి యుధ్ధానివారణ చేసిన గొప్ప చక్రవర్తి.Approximate extent of Maurya empire 
under Asoka. The empire stretched
from Afghanistan to Bengal 
to southern India


కేవలం తిండికో, రాజ్యకాంక్షకో, నిధులకో లేక వ్యక్తిగత కారణాలకో యుధ్ధాలు చేసేవారు అధర్మం వైపు ఉంటారు. 
గ్రీకు చరిత్రలో ఒక రాణి కోసం యుధ్ధం చేయడం మనకు తెలిసినదే. అందులో కేవలం ఇద్దరు రాజుల మధ్య జరిగే యుధ్ధం ఉన్నప్పటికి అందులో ధర్మాధర్మ విచక్షణ చేసే గొప్ప పాత్రలు మిళితమై ఉన్నాయి. ధర్మం తెలిసీ అధర్మం వైపు నిలబడల్సిన భయంకర పరిస్థితిని ఇందులో చూడవచ్చు.

మనం చెప్పుకున్న పై ఉదాహరణలు అన్నీ ధర్మానికి పెను ప్రమాదం కలిగినప్పుడు గొప్ప సవాళ్లను ఎదుర్కొని దాన్ని రక్షించి తిరిగి ధర్మాన్ని స్థాపించిన గొప్ప నాయకుల గాథలే. ఇలా మన చరిత్రే వీరులమయం.

మరి ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ 'బాహుబలి'  అనే కల్పితం మన చరిత్ర ముందు యేపాటిది?
ఇంతమంది నిజమైన బాహుబలులు ఉండగా, ఒక కల్పిత కథను సృష్టించాల్సిన అవసరం దేనికి అనేది అడగవలసిన ప్రశ్న.

1. వీరందరికన్నా గొప్ప పాత్ర అయిఉండాలి.
2. మన సనాతనధర్మాన్ని నిలిపి మన మనుగడను కాపాడిన చక్రవర్తుల గాధలు తీద్దామంటే అవి ఎవరికైనా నచ్చకపోయి ఉండాలి.
3. అటువంటి నిజమైన గాథలు తెరకెక్కించడం వీలుకాకపోయుండాలి,

కనీసం వ్యాపార పరంగా కూడా 'బాహుబలి' అనే టైటిల్ ఒక బలహీనమైనది.
సినేమా చూడకపోయినా అర్థం అయిపోయే ఒక కల్పిత పాత్ర మీద 300 కోట్ల ఖర్చు గొప్ప సాహసం.
ఈ సాహసం వెనుక సినేమాను వ్యాపారంగా మాత్రమే చూసే వారికైనా, 300 కోట్లు ఇటువంటి మామూలు పాత్రకు యెలా సమానమో అర్థం కావడం కష్టమే.

"అందరి కళ్ళు నావైపే చూస్తున్నాయి, నేను ఎవర్ర్ని!?" అని బాహుబలి అనడం దైవ సంకల్పమే. 
ఒక కల్పిత పాత్ర అలా తనని తాను ప్రశ్నించుకోవడం మామూలు విషయం కానే కాదు.

నిజంగా బాహుబలి ఎవడు? కేవలం గ్రాఫిక్స్ కోసం తయారుచేసిన ఒక కల్పిత వస్తువా?
లేక దేన్నయినా చూసి చప్పట్లు కొట్టే మన మేధస్సు మీద ఉన్న నమ్మకానికి ప్రతిరూపమా?